: వీహెచ్ పీ యాత్రకు యూపీ సర్కారు నో
విశ్వహిందూ పరిషత్ చేపట్టిన యాత్రకు ఉత్తరప్రదేశ్ సర్కారు అనుమతి నిరాకరించింది. అయోధ్యలో రామజన్మభూమి వద్ద ఆలయం నిర్మించాలన్న డిమాండుతో ఆగస్టు 25 నుంచి వీహెచ్ పీ ఉత్తరప్రదేశ్ లో యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయమై వీహెచ్ పీ నేతలు శనివారం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు ఆయన తండ్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ను కలిశారు. తమ యాత్రకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. అయితే, అఖిలేశ్, ములాయం ఈ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ యాత్రకు అనుమతినిస్తే సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టవుతుందని వారు తెలిపారు. ఇక, రామజన్మభూమి విషయమై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని వారు ములాయంకు సూచించగా, అయోధ్య వ్యవహారంలో సుప్రీం చెప్పిందే తమకు వేదమన్నారు.