: నాపై కేసు పెట్టడం ఆశ్చర్యం: వీహెచ్
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానంటూ తనపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజ్యసభ సభ్యుడు వి. హనమంతరావు అన్నారు. ఎక్కడా తాను రెచ్చగొట్టేలా మాట్లాడలేదన్నారు. మొదటినుంచి తాను రాష్ట్ర విభజనపై ఒకే మాటమీద ఉన్నానని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో సమైక్యవాదులు దాడి చేసినందుకు కేసు పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ముఖ్యమంత్రితో చెప్పానన్నారు. కానీ, ఉదయం పత్రికల్లో చూస్తే తనపై ఓ కేసు, దాడిచేసిన వారిపై ఓ కేసు పెట్టినట్లు రావడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. తానేమి సొంత వ్యాఖ్యలు చేయలేదన్న వీహెచ్ సీడబ్ల్యూసీ మాటలే చెప్పానన్నారు. ఇంతవరకు చాలామంది అలాంటి మాటలు మాట్లాడినా అవి రెచ్చగొట్టినట్లు కాదా? అని ప్రశ్నించారు. ఎక్కడా తాను తప్పు చేయలేదని ఒకవేళ తప్పుచేస్తే క్షమాపణ చెప్పటానికి వెనకాడనన్నారు వీహెచ్.