: వృక్షాలను ప్రేమించండి: సీఎం కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మన పర్యావరణం వృక్షాల మనుగడపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వాటిని ప్రేమిస్తే, వాతావరణం కాలుష్యం బారిన పడకుండా ఉంటుందని వివరించారు. 64వ వనమహోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కండ్లకొయ్యలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, వనాల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ప్రభావం మన జీవితాలపై పడుతుందన్నారు. అందుకే, ప్రతి చిన్నారికి కూడా చెట్లను సంరక్షించే దిశగా చైతన్యం కలిగించాలని సూచించారు. పూర్వీకులు మనకు ఆస్తిని ఏ విధంగా ఇస్తారో, ఈ వృక్ష సంరక్షణ బాధ్యతను వారసత్వంగా ఇవ్వాలని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో రాష్ట్రంలో అడవులను 33 శాతం మేర పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మనిషిని చంపితే ఎలాంటి శిక్షలు విధిస్తారో.. చెట్లను నరికినా, అటవీ జంతువులను చంపినా అలాంటి కఠిన శిక్షలే విధించాలని ఆయన పేర్కొన్నారు.