: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు సాధారణ రైల్వే స్టేషన్ కాదండోయ్. దేశంలోనే ప్రత్యేక రైల్వే స్టేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ ఫామ్స్ ఉంటే అన్నింటికీ ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. పైగా రెండు ప్రవేశ ద్వారాల వద్ద లిఫ్టులను కూడా అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఇలా అన్ని ప్లాట్ ఫామ్ లలోనూ ఎస్కలేటర్లు ఉన్న ఏకైక, తొలి రైల్వే స్టేషన్ సికింద్రాబాదే. అధికారులు గత వారమే 7వ ఎస్కలేటర్ ను 4,5 ప్లాట్ ఫామ్ ల వద్ద ప్రారంభించారు. ఇందుకు 6.60 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
రోజూ 43,000 మంది ప్రయాణికులు ఎస్కలేటర్లను వినియోగించుకుంటారని భావిస్తున్నారు. నిమిషానికి ఒక ఎస్కలేటర్ 180 మందిని తీసుకెళ్లగలదు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అత్యంత రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమంతట తామే నడుచుకుంటూ వంతెన దాటాలంటే చాలా సమయం పడుతుంది. ఎస్కలేటర్ల ద్వారా అయితే వేగంగా రాకపోకలు సాగించవచ్చు.