: జనుము మొక్క జీవితచక్రం తెలిసిపోయింది


జీవి జీవితానికి సంబంధించిన జన్యు పటాన్ని గుర్తించిగలిగితే ఇక ఆ జీవికి సంబంధించిన జీవిత చక్రం పూర్తిగా తెలిసిపోతుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రకాలైన మొక్కలు, జంతువులకు సంబంధించిన జన్యు చిత్రాలను ఆవిష్కరించారు. ఈ నేపధ్యంలో జనుము మొక్కకు సంబంధించిన జన్యుపటాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొన్ని నెలల పాటు జరిపిన పరిశోధనల వల్ల సంప్రదాయ రకానికి చెందిన జనుము మొక్క జన్యుపటాన్ని ఆవిష్కరించారు. దీంతో ఆ మొక్కకు సంబంధించిన అన్ని జన్యు పత్రాలు ఆ దేశానికి సొంతమవుతాయి.

బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త ముక్సుదుల్‌ ఆలమ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు బృందం జనుము మొక్క జన్యుపటాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని గురించి బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్ హసీనా మాట్లాడుతూ జనుము జన్యుపటాన్ని మన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని, ఈ మొక్క జీవిత చక్రానికి సంబంధించిన రహస్యాలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయని తెలిపారు. జనుము జన్యుపటంపై మేధో హక్కులను పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఆమె వెల్లడించారు. ఈ పటాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ ఆలమ్‌ జన్యుశాస్త్రంలో ఇప్పటికే అనేక విజయాలను నమోదు చేసుకున్నారు. బొప్పాయి, రబ్బరు, శిలీంద్రాలకు సంబంధించిన జన్యు పటాలను ఆయన ఆవిష్కరించారు. ఇప్పుడు తాజాగా ఈయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జనుముకు సంబంధించిన జన్యుపటాన్ని ఆవిష్కరించింది.

  • Loading...

More Telugu News