: అంతరిక్షాన్ని తవ్వేద్దాం!
అంతరిక్షాన్ని కూడా వదలకుండా తవ్వేద్దామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే భూమిలో చాలా లోతు వరకూ మనకు అవసరమైన ఖనిజాలకోసం తవ్వేస్తున్నాం. దీనివల్ల సమాజానికి ప్రమాదం సంభవిస్తున్నా కూడా మనకు కావలసిన ఖనిజం కోసం మనం మాత్రం తవ్వకాలు చేపడుతూనే ఉన్నాం. ఇప్పుడు అంతరిక్షంలో కూడా ఖనిజాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు కొన్ని గ్రహ శకలాలు ఇలా ఖనిజాల తవ్వకానికి అనువుగా ఉన్నాయని గుర్తించారు. ఈ గ్రహ శకలాలపై తవ్వకాలను జరిపి ఖనిజాలను తెచ్చుకోవచ్చని చెబుతున్నారు.
అమెరికా గ్లాస్గోలోని స్ట్రౌత్క్లైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంతరిక్షంలోని కొన్ని గ్రహశకలాలపై తవ్వకాలు చేపట్టి విలువైన ఖనిజాలను తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఇలా తవ్వకాలను జరిపేందుకు కొన్ని గ్రహ శకలాలు అనువుగా ఉన్నట్టు గుర్తించామని కూడా ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి దగ్గరగా ఉన్న సుమారు తొమ్మిదివేలకు పైగా ఉన్న గ్రహశకలాలనుండి పలు పరిశోధనల తర్వాత ఒక డజను శకలాలను ఇలా ఖనిజాల తవ్వకాలకు ఎంచుకున్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. వీటికి ఈఆర్ఓ (ఈజిలీ రిట్రైవబుల్ ఆబ్జెక్ట్స్) అని పేరుపెట్టారట. అయితే సూర్యుని కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహ శకలాలపై తవ్వకాలను చేపట్టాలంటే వాటిని లాక్కొచ్చి చంద్రుని కక్ష్యలోనో లేదా భూమి కక్ష్యలోనే ప్రవేశపెట్టాలిట. ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇప్పుడు మనకున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యమేనని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత భూమికి ఎంతో లాభదాయకమైన ఖనిజాలను పైనుండి తవ్వి తెచ్చుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మరోవైపు ఇలా విరుద్ధంగా చేయడం వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.