: వైఎస్సార్సీపీ వల్లే ఉద్యమం అదుపు తప్పుతోంది: సీపీఐ నారాయణ
సమైక్యాంధ్ర కోసం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమం వైఎస్సార్సీపీ స్వార్థ రాజకీయాల కారణంగా అదుపు తప్పుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ పార్టీ రాజకీయ లబ్ది కోసం యత్నిస్తోందని ఆరోపించారు. అయితే, సీమాంధ్ర ఉద్యమం ఎలాంటి స్వార్థ రాజకీయ ఉద్యమం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలతోనే ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆయన వివరించారు. అందుకే, ఈ అపోహలు తొలగించేందుకు కేంద్రం ఓ అధికారిక కమిటీని నియమించాలని సూచించారు. ఇక రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు సాగునీరు, కోస్తాంధ్ర ప్రాంతాలకు తాగునీరు సమస్య ఉత్పన్నమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.