: హైదరాబాదు, భద్రాచలం అంశాలను ఆంటోనీ కమిటీతో చర్చిస్తాం: టి-మంత్రులు
హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరుగుతున్న తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేపు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో ఆంటోనీ కమిటీని కలవనున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం ఈ మేరకు రేపు హస్తిన పయనమవుతామని పేర్కొన్నారు. నదీ జలాలు, హైదరాబాదు, భద్రాచలం అంశాలను కమిటీ ఎదుట ఉంచుతామని వెల్లడించారు. తొలుత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన పట్ల అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతామని ఆయన చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుతో పాటు 10 జిల్లాలుండాలని తేల్చి చెప్పారు. తాజా పరిణామాలపై స్పందిస్తూ, వీహెచ్ పై దాడి సరికాదన్నారు. సామరస్యపూర్వకంగానే విడిపోదామని పిలుపునిచ్చారు.