: గూగుల్ గుండె ఆగినవేళ
ఇంటర్నెట్ ప్రజలకు ఎక్కువగా పరిచయమైనది గూగుల్. మనకు ఏది కావాలన్నా వెంటనే మనం వెదికేది గూగుల్‌లోనే. ఇలా మనకు బోలెడు సమాచారాన్ని అందించేందుకు నెట్‌లో సిద్ధంగా ఉండే గూగుల్ పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది.... సరిగ్గా శుక్రవారం నాడు అలాగే జరిగింది. గూగుల్ సేవలు సుమారు ఐదు నిముషాల పాటు ఆగిపోయాయట. దీంతో ఒక్కసారిగా నెట్ ప్రపంచం ఉలిక్కిపడింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కార్యకలాపాలను అందించే గూగుల్ శుక్రవారం నాడు సాయంత్రం ఐదు నిముషాలపాటు పనిచేయడం మానేసింది. సాయంత్రం గం 4.21 నుండి గం 4.25 వరకు గూగుల్ సంస్థకు చెందిన సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ఇలా అన్నీ ఓ ఐదు నిమిషాలపాటు పనిచేయడం మానేశాయి. జీమెయిల్ వినయోగదారులకు చాలామందికి ఎర్రర్ మెసేజ్‌లు వచ్చాయి.
ఈ విషయం గురించి గూగుల్ సంస్థ అధికారులు మాట్లాడుతూ 'పసిఫిక్ పగటి కాలమానం(పీటీడీ) ప్రకారం గం 15:51నుండి గం 15:52 దాకా 50 నుండి 70 శాతం జీమెయిల్ వినియోగదారులకు సమస్య వచ్చిందని, తర్వాత నిమిషంలోనే చాలా వరకూ సరిచేశామని, నాలుగు నిమిషాల తర్వాత పూర్తిగా సమస్యను నివారించామని తెలిపారు. అయితే గూగుల్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇలా సేవలు ఆగిపోవడానికి కారణాలను గురించి మాత్రం గూగుల్ సంస్థ వెల్లడించలేదు. ఈ ఐదు నిమిషాల సేవల స్తంభన వల్ల గూగుల్ సంస్థకు రూ.3.18 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు.