: మూడు నెలల్లో కిరోసిన్ రహిత బెంగళూరు
మరో మూడు నెలల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కిరోసిన్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ ను పొందే వినియోగదారులు ఇక తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 5 లక్షల పేద కుటుంబాలకు నెలకు 5 లీటర్ల కిరోసిన్ అందిస్తున్నారు. తక్షణమే ఇద్దరు కుటుంబ సభ్యులున్న కుటుంబాలకు కిరోసిన్ ను 2 లీటర్లకు తగ్గించనున్నారు. కిరోసిన్ వాడుతున్న కుటుంబాలు ఇప్పటికీ వంట చెరకు వాడుతున్నాయని, దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందని, పర్యావరణానికి కాలుష్యమేనని అధికారులు అంటున్నారు. ఒక అధికారి మాట్లాడుతూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, రెండు నెలల తర్వాత కిరోసిన్ సరఫరా నిలిపివేస్తామని, ఇక వారు తప్పకుండా గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ స్టవ్ లను తీసుకోక తప్పదని చెప్పారు. మొత్తానికి కిరోసిన్ పంపిణీ నిలిచిపోతే కర్ణాటకలో కిరోసిన్ రహిత తొలి పట్టణంగా బెంగళూరు నిలిచిపోతుంది.