: ఇది క్యాన్సర్ కణాన్ని దెబ్బతీస్తుంది
క్యాన్సర్ వ్యాధిని నివారించేందుకు శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాధిని సమూలంగా నాశనం చేసేందుకు సమర్ధవంతమైన ఔషధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక కొత్తరకం మందును శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మందు క్యాన్సర్ కణాలను సమర్ధవంతంగా నాశనం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
న్యూసౌత్‌వేల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాల నిర్మాణాన్ని దెబ్బతీసే ఒక కొత్తరకం మందును రూపొందించారు. ఈ మందు చర్మ క్యాన్సర్, పిల్లల్లో కనిపించే న్యూరో బ్లాస్టోమాపై సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు జంతువులపై చేసిన ప్రయోగంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పీటర్ గనింగ్ ఈ కొత్తమందును గురించి మాట్లాడుతూ ఈ మందు క్యాన్సర్ కణం నిర్మాణాన్ని చాలా త్వరగా దెబ్బతీస్తుందని, దీని ప్రభావం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. ఇది అన్ని రకాల క్యాన్సర్ కణాలను దెబ్బతీయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.