: పాలపుంత బరువు తక్కువేనట
మనం నివసించే పాలపుంత బరువు గతంలో అంచనా వేసినదాని కన్నా కూడా తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో మనం అంచనా వేసిన బరువులో మూడు నుండి నాలుగు వంతులు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆలిస్ డీసన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు బృందం రెండు సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా రెండు గెలాక్సీలను సృష్టించి వాటిని పోల్చి చూశారు. వీటిలో సాధారణ, కృష్ణ పదార్ధాన్ని ఉపయోగించి పాలపుంతలను నిర్మించారు. ఒక సిమ్యులేషన్‌లో 80 వేల కోట్ల సూర్యుళ్లున్నంత బరువున్న కాంతి వలయం తయారైంది, మరోదానిలో లక్షల కోట్ల సూర్యుళ్లంత బరువున్న కాంతి వలయం ఏర్పడింది.
ఇందులో చిన్న సిమ్యులేషన్ వాస్తవ పరిశీలనకు సరిపోతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గెలాక్సీలోని కృష్ణ పదార్ధం ద్రవ్యరాశిని అంచనా వేసిన శాస్త్రవేత్తలు పాలపుంత బరువును నిర్ధారించేందుకు ప్రయత్నించారు. చిన్న గెలాక్సీలు విలీనం కావడం వల్ల గెలాక్సీలు పెద్దవి అవుతుంటాయి. అలాగే కృష్ణ పదార్ధం తునకల చుట్టూ సాధారణ పదార్ధాలు చేరడం వల్ల తొలినాటి గెలాక్సీలు ఏర్పడి వుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే కంటికి కనిపించని కృష్ణ పదార్ధం, విశ్వంలోని మొత్తం పదార్ధంలో 80 శాతం మేర ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రెండు సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా ఏర్పడిన గెలాక్సీలను పరిశీలించిన శాస్త్రవేత్తలు చిన్న సిమ్యులేషన్ వాస్తవ పరిశీలనకు సరిపోతుందని నిర్ధారించారు. గతంలో పాలపుంత బరువు విషయంలో వేసిన అంచనాల ప్రకారం గెలాక్సీలో వేలాదిగా ఉపగ్రహాలు ఉండాలి. అయితే మన పాలపుంతలో కేవలం 26 మాత్రమే ఉన్నాయి. కాబట్టి గతంలో వేసిన అంచనాల ప్రకారం పాలపుంత బరువుతో పోల్చి చూస్తే ప్రస్తుత అంచనాల ప్రకారం పాలపుంత బరువు కేవలం మూడు నుండి నాలుగోవంతు మేర మాత్రమే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు.