: బిడ్దకు పాలిస్తే తల్లికి ప్రమాదం తగ్గుతుందట
బిడ్డలకు చక్కగా పాలిచ్చే తల్లులకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని ఒక పరిశోధనలో తేలింది. కొందరు తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు ఆసక్తి చూపరు. అందం తగ్గిపోతుందనో, మరే ఇతర కారణాలవల్లనో పిల్లలకు తమ పాలివ్వకుండా డబ్బా పాలను అలవాటు చేస్తుంటారు. ఇలాంటి వారికి భవిష్యత్తులో రొమ్ము క్యాన్సరు వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తమ పిల్లలకు ఆరు నెలలకు పైగా తమ పాలిచ్చిన తల్లులకు రొమ్ము క్యాన్సర్ ముప్పు దాదాపుగా దూరంగా ఉంటుందని తేలింది. శాస్త్రవేత్తలు నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందట. అయితే పొగతాగే తల్లులకు మాత్రం ఇలాంటి ప్రయోజనం ఉండే అవకాశం తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. 2004 నుండి 2009 వరకూ రొమ్ము క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకున్న మహిళల వైద్య రికార్డుల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు తెలిపారు.
వీరు 19-91 ఏళ్ల వయసున్న మహిళల వైద్య రికార్డులను ఈ సందర్భంగా అధ్యయనం చేశారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధి బాధిత మహిళల్లో వారు ఏ వయసులో రొమ్ము క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు, వారు ఎన్నాళ్లపాటు తమ పిల్లలకు స్థన్యమిచ్చారు, వారికి స్థూలకాయం సమస్య ఉందా, వారి కుటుంబంలో ఎవరైనా ఇదివరకే ఇదే జబ్బు బారిన పడ్డారా వంటి పలు అంశాలను తాము పరిశీలించామని, తాము సేకరించిన విషయాల్లోనే పిల్లలకు చక్కగా ఆరునెలల పాటు పాలిచ్చిన తల్లులకు రొమ్ముక్యాన్సరు ముప్పు దాదాపుగా ఉండదనే విషయం స్పష్టంగా తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.