: ఈ 'బుక్'తో ఆనందం ఆవిరేనట!
మనవాళ్లు ఎక్కువగా ఉపయోగించే బుక్ ఏది అంటే... ఫేస్‌బుక్ అని ఠక్కున చెప్పేస్తారు. అయితే ఇలా ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగించేవారికి ఆనందం అనేది క్రమేపీ దూరమవుతుందంటున్నారు పరిశోధకులు. రోజులో ఎక్కువ భాగం ఫేస్‌బుక్‌లో గడిపేవారిలో సంతోషం తగ్గుతున్నట్టుగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిందట.
మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఫేస్‌బుక్‌తో ఎక్కువ సమయం గడిపేవారి జీవితంలో సంతోషం క్రమేపీ తగ్గుతున్నట్టు తేలిందట. 82 మంది యువతీ యువకులపై సుమారు రెండు వారాలపాటు పరిశోధకులు ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారంతా ఫేస్‌బుక్‌తో క్రమం తప్పకుండా అనుసంధానం అయ్యేవారే. వీరికి రోజూ ఐదుసార్లు కొన్ని ప్రశ్నలనిచ్చి వారినుండి పరిశోధకులు సమాధానాలను రాబట్టేవారు. 'ఈరోజు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏయే సందర్భాల్లో మీరు ఎలా వ్యవహరించారు?' వంటి ప్రశ్నలను అడిగి వారినుండి సమాధానాలను రాబట్టేవారు.
ఈవిధంగా రెండు వారాలపాటు సర్వేలో పాల్గొన్న వారినుండి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ సమాచారం నుండి ఫలితాలను పరిశోధకులు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో తేలిందేమంటే ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగించేవారి జీవితంలో సంతృప్తిస్థాయి క్రమేపీ తగ్గిపోతోందట. ఫేస్‌బుక్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా సన్నిహితులు, మిత్రులతో కలిసి మాట్లాడిన వాళ్లలో సంతృప్తిస్థాయి మెరుగ్గా ఉందని వీరు పరిశోధనలో తేలింది. అయితే ఈ అనుభవాలకు ఆధారాలు ఏమిటనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.