: తల్లులు సరైన ఆహారం తీసుకుంటే చాలు


తల్లులు సరైన ఆహారం తీసుకుంటే చాలు, పుట్టే పిల్లలు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేలా చక్కటి ఆరోగ్యంతో పుడతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా చాలామంది తల్లులు అవగాహనా లోపం వల్ల సరైన ఆహారం తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తారు. ఇలాంటి వారికి ఇదో హెచ్చరిక. తల్లులు తమ ఆహారంలో తగినంత మోతాదులో అయోడిన్‌ ఉండేలా జాగ్రత్త వహించాలి. లేకుంటే తల్లిలో అయోడిన్‌ లోపం వల్ల ధైరాయిడ్‌ కూడా లోపించి పిల్లల్లో ఆటిజమ్‌ ముప్పు ఎక్కువగా ఉండేలా చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి తల్లులు తమ ఆహారంలో తగిన మోతాదులో అయోడిన్‌ ఉండేలా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో థైరాయిడ్‌ హార్మోను మోతాదు తక్కువగా ఉన్న గర్భిణులకు పుట్టే పిల్లలకు ఆటిజమ్‌ ముప్పు మిగిలిన వారితో పోల్చుకుంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇందుకోసం నాలుగువేలమంది తల్లులను, వారి పిల్లలకు పరిశోధకులు పరిశీలించారు. తల్లుల్లో థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల వారి పిల్లలకు ఆటిజమ్‌ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయనే భావనను ఇది బలపరుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయం గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన గుస్తావో రోమన్‌ మాట్లాడుతూ చాలామంది పిల్లల్లో పర్యావరణ సంబంధ అంశాలే ఆటిజమ్‌కు కారణమవుతున్నాయని, జన్యువులు కాదని, అందువల్ల దీన్ని నివారించవచ్చనే ఆశను ఈ అధ్యయనం రేకెత్తించిందని తెలిపారు. తల్లుల్లో థైరాక్సిన్‌ హార్మోన్‌ (టీ5) లోపం ఎక్కువగా ఉంటే వారికి పుట్టిన పిల్లల్లోనూ ఆటిజమ్‌ లక్షణాలు అధికంగా కనపడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. థైరాయిడ్‌ హార్మోన్‌ తల్లుల్లో తగ్గడానికి కారణం వారు ఆహారం ద్వారా తగినంత మోతాదులో అయోడిన్‌ను తీసుకోకపోవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News