: క్యాన్సర్ వ్యాప్తికి మూలం ఇదే
క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమైన అణువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధికి కారణాలను గురించి పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలకు ఒక ప్రధానమైన అణువు క్యాన్సరు వ్యాధి వ్యాప్తికి కారణమవుతోందన్న విషయాన్ని గుర్తించడంతో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించేవిధంగా వైద్య విధానాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యాది వ్యాప్తికి కారణమైన ప్రధానమైన అణువును నిలువరించడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మెల్బోర్న్కు చెందిన వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమవుతోన్న ఒక కీలకమైన అణువును గుర్తించారు. ఈ అణువు కారణంగానే క్యాన్సర్ వ్యాధి శరీరమంతటా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గురించారు. ఇప్పటి వరకూ క్యాన్యర్ వ్యాధి వ్యాప్తిలో దీని ప్రభావాన్ని గురించి శాస్త్రవేత్తలు తక్కువగా అంచనా వేశారని, అయితే ఇది క్యాన్సర్‌ను చాపకింద నీరులాగా వ్యాప్తి చేస్తుందని ఈ అణువును గురించి పరిశోధనలు చేసిన డాక్టర్ ట్రాసీ పుటోక్జీ చెబుతున్నారు. ఈ ప్రధానమైన అణువును అరికట్టగలిగామంటే క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టినట్టేనని ట్రాసీ అంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా పేగు, ఉదరాలకు సంబంధించిన క్యాన్సర్లను అరికట్టవచ్చని, ప్రసంచంలో సాధారణంగా వచ్చే క్యాన్సర్ వ్యాధులు ఇవేనని, క్యాన్సర్ పుండు పెరిగినపుడు క్యాన్సర్ రహిత కణజాలాల చుట్టూ మంట ఏర్పడి, అవి ప్రోటీన్ సంబంధిత 'ఇంటర్‌ల్యూకిన్-11, 6'సహా కొన్ని అణువులను ఉత్పత్తి చేస్తాయని, వీటిని సైటోకైన్లుగా వ్యవహరిస్తారని ట్రాసీ తెలిపారు. క్యాన్సర్ వ్యాప్తిలో ఈ సైటోకైన్లు ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా ఇంటర్‌ల్యూకిన్-11 అణువు మరింత ప్రభావం చూపుతుందని డాక్టర్ ట్రాసీ చెబుతున్నారు.