: బొత్సకు క్లాస్ తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం!?
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ క్లాస్ తీసుకుందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా సంతకాలు సేకరించారని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఎందుకు ధిక్కరించాల్సి వచ్చిందని అధిష్ఠానం పెద్దలు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలా ఎందుకు చేశారని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీరెలా సంతకం చేశారని అడిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విభజన ప్రకటనపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ లే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటూ.. బీజేపీ, అన్నా డీఎంకే, ఇతర పార్టీలు పదేపదే ప్రశ్నిస్తున్నాయని అధిష్ఠానం బొత్సపై అసహనం వ్యక్తం చేసినట్లు వినికిడి. వీరిద్దరి మూలంగా ఢిల్లీలో అప్రదిష్టపాలవ్వాల్సి వచ్చిందని మండిపడినట్లు తెలుస్తోంది. దాంతో, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బొత్స పలువురు నేతలను కలిసి రాష్ట్ర విభజనపై బాహాటంగా ఎలాంటి విమర్శలు చేయవద్దని చెప్పినట్లు సమాచారం. ఏవైనా ఉంటే ఆంటోనీ కమిటీతో స్వేచ్ఛగా చెప్పాలని కోరినట్లు చెబుతున్నారు.