: తొలిసారిగా భయపడుతూ సినిమా తీశాను: రాంగోపాల్ వర్మ
తొలిసారిగా తాను ఒక భయంతో సినిమా తీశాననీ, అదే 26/11 అనీ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. ఇన్నాళ్ళూ ఇన్ని సినిమాలు తీసినా ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇంతటి భయం పడలేదని ఆయన అన్నారు.
"కొన్ని సినిమాలను కచ్చితమైన అభిప్రాయాలతో తీశాను. మరికొన్ని సినిమాలు ఓ విధమైన కసితో తీశాను. ఇంకొన్ని సినిమాలు పొగరుతో తీశాను. తొలిసారిగా 26/11 సినిమాను మాత్రం భయపడుతూ తీశాను. ముంబై దాడుల బాధితులు, పోలీసు అధికారులు చెప్పిన అనుభవాల ఆధారంగా ఈ సినిమా తీశాను. వారు చెప్పిన విషయాలను అంతే ఉద్వేగంతో ప్రేక్షకుల ముందు సినిమా రూపంలో వుంచగలనా? లేదా? అన్న భయంతో దీనిని తీశాను" అన్నారాయన. మార్చి 1 న విడుదలవుతున్న ఈ సినిమాలో వర్మ ఓ పాట పాడడం విశేషం!