: చావు అనుభవం ఎలా ఉంటుందంటే...
చావుకు అతి సమీపంలోకి వెళ్లినవారి అనుభవం ఎలా ఉంటుంది... ఏమో ఆ పరిస్థితి ఎదురైన వారిని అడిగితే తెలుస్తుంది అనుకుంటున్నారా... ఇలాంటి అనుభవం ఒకసారి అనుభవంలోకి వస్తే ఇక బతకడం అసాధ్యం. అయితే శాస్త్రవేత్తలు ఇలాంటి అనుభవానికి ఎదురై, మృత్యువును అనుభవించి తిరిగి బతికిబట్టకట్టినవారి అనుభవం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని పరిశోధనల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మృత్యువు అనుభవానికి సంబంధించి పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు జరిపారు. ఇప్పటి వరకూ గుండెపోటుకు గురైన వారిలో తక్షణ వైద్యసహాయం లభించి ప్రాణాలతో బతికి బయటపడ్డవారు మృత్యువు ఎదురైనపుడు తమకు ఒక సొరంగం చివర ప్రకాశవంతమైన వెలుతురు కనిపించిందని చెప్పారు. ఇలాంటి సమాచారం మినహా మరే ఇతర సమాచారం మృత్యువును ఎదుర్కొన్న వారి అనుభవాలకు సంబంధించినది లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఎలుకలకు కృత్రిమంగా గుండెపోటును తెప్పించి, అవి మరణించే సమయంలో వాటి మెదడులో జరిగే సంచలనాలను నమోదు చేశారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయి మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయిన ముఫ్ఫై సెకన్లలో మెదడులో క్రియాశీలత విపరీతంగా పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండెపోటు వచ్చినప్పుడు మెదడులో కొంతమేర చైతన్యం ఉంటుందని తాము గతంలో భావించామని, ఈ ప్రయోగాల ద్వారా అది నిజమని ఋజువుకావటమేగాక మెదడు క్రియాశీలత అత్యధిక స్థాయికి చేరుకుంటోందని తెలిసినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ విషయంపై మరింత లోతైన పరిశోధనలు నిర్వహిస్తున్నారు.