: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లింది: చంద్రబాబు


'ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన క్రెడిట్ మీకే కావాలి, వ్యతిరేకించిన క్రెడిట్ మీకే కావాలి' అని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ కనీస ధర్మం లేకుండా విభజన ప్రకటించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గ్రామంలో అన్నదమ్ములు విడిపోతేనే,కలిసిమెలసి బాధ్యతగా బ్రతకండని చెబుతారని, అది కూడా కాదంటే, సరిగా పంపకాలు చేసి ఆనందంగా ఉండడండని చెబుతారని అన్నారు. మరి, ఆంధ్రప్రదేశ్ ను ఏ ప్రాతిపదికన విభజించారని ప్రశ్నించారు. ఏపీలో తమ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచీ టీడీపీని టార్గెట్ చేసే విధంగా ప్రవర్తించడమే ప్రధాన లక్ష్యం అయిందని ఆరోపించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారినీ కూర్చోబెట్టి మాట్లాడకుండా, మీ స్వంత వ్యవహారంలా ఎలా విడగొడతారని మండిపడ్డారు. ఇది ఇంటి వ్యవహారం కాదని, ఒక జాతి వ్యవహారమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా యధేచ్ఛగా దోచుకున్నారని గుర్తు చేశారు. దానిపై అవిశ్వాసం పెట్టినా, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో నెహ్రూ ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అప్పట్లో కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని, దానికి నాంది పలికి ఆంధ్రప్రదేశ్ లో అందరూ కలిసి ఉండండని చెప్పడానికే నెహ్రూ వచ్చారని బాబు అన్నారు. ఇందిరా గాంధీ ఎందుకు వచ్చిందో తెలుసా? అని అడిగారు. రాష్ట్రాన్ని విభజించే ప్రశ్నేలేదని, కలిసి ఉండాల్సిందేనని చెప్పడానికి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు తెలుగు జాతిని ముక్కలు చేశారని అన్నారు. అన్నదమ్ములు కలహించుకోవడం సహజమేనంటూ, కానీ, వారు కలిసుండడానికి ఏదో ఒకటి చెయ్యాలని అన్నారు. కలిసి ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.

ఈ రాష్ట్ర ప్రజల చలవతో పదేళ్లు ఢిల్లీ గద్దెనెక్కిన మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం.. ప్రజలను విభజిస్తామని చెప్పారని ఆక్షేపించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళుతున్న శుభ సమయంలో కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకుపోయిందని విమర్శించారు.'నేను వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకుని కష్టపడ్డాను'అని తెలిపారు. 'నా జాతి బాగుపడాలని నేను పరితపిస్తే కాంగ్రెస్ పార్టీ నా కలలని కల్లలు చేసింది'అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతీయులను కలిసి, వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన పరిస్థితి రాజకీయనాయకులదేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News