: 'మంటల' పిల్లాడి ఆరోగ్యం సాధారణం: వైద్యులు
శరీరం నుంచి మంటలు ఎగసి పడుతున్న తమిళనాడు చిన్నారి ఆరోగ్యం సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. విల్లుపురం జిల్లా పరంగనికి చెందిన 50 రోజుల బాలుడి శరీరం నుంచి మంటలు రావడంతో అతడి చర్మానికి కాలిన గాయాలయ్యాయి. ఇప్పటివరకు అతడి శరీరం నుంచి నాలుగుసార్లు మంటలు జనించాయి. ప్రస్తుతం ఈ చిన్నారికి చెన్నైలోని కీల్పాక్ మెడికల్ కాలేజి వైద్యులు చికిత్స చేస్తున్నారు. శరీరం నుంచి మంటలు రావడానికి ఎలాంటి లోపాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. బాలుడి శరీరంలో అన్ని అవయవాల పనితీరును వైద్యులు పరిశీలించారు. మూత్రపిండాలు, లివర్, సాధారణంగానే ఉన్నాయని, ఎముకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. రక్తం, మూత్రం, చెమటను పరీక్షించినా అందులో మండే స్వభావమున్న రసాయనాలు ఉన్నట్లు తేలలేదని చెప్పారు. క్రోమోజోముల పరీక్ష ఫలితాలు ఈ వారం చివర్లో వస్తాయని వెల్లడించారు.