: ఉల్లి ధర విన్నా కన్నీళ్లు రావాల్సిందే!
ఉల్లిపాయలను కోస్తుంటే కళ్ల వెంట నీళ్లు రావడం సర్వసాధారణం. దాని ఘాటు ఆ స్థాయిలో ఉంటుంది. కానీ, ఇప్పుడు ఉల్లి కోసం మార్కెట్ కు వెళ్లినా కళ్లు నీళ్లతో నిండిపోతాయి! ఎందుకంటే, దాని ధర కూడా ఇప్పుడు తెగ ఘాటెక్కింది మరి. గత నెల రోజుల కాలంలో ఉల్లి ధర పగ్గాలు తెంచుకున్నట్లుగా పెరుగుతూ వస్తోంది. ఇప్పడు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఉల్లి రిటైల్ మార్కెట్లో కిలో ధర 55 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. సీమాంధ్రలో నిరవధిక సమ్మె దెబ్బతో అక్కడ ఉల్లి నిన్నటి నుంచి 80 రూపాయలకు చేరింది. కాగా, సీమాంధ్రలో బంద్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. లారీలు నిలిచిపోవడంతో రవాణాకు అవాంతరాలు ఏర్పడనున్నాయి.
ఉల్లి ధర పెరగగడానికి ఇవేకాకుండా పలు కారణాలు ఉన్నాయంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్ గావ్ లో రంజాన్, వారాంతంలో మార్కెట్ మూసివేయడం వల్లే ధరలు పెరిగాయనే వాదన ఉంది. కానీ, గోదాములలో తగినంత నిల్వలు ఉన్నా మార్కెట్లోకి విడుదల చేయకుండా వ్యాపారులే సరఫరాను నియంత్రిస్తూ ధరలకు ఆజ్యం పోస్తున్నారని మరో వాదన వినిపిస్తోంది. మార్కెట్లోకి కొత్త పంట సెప్టెంబర్ చివరి వారం నుంచీ కానీ రాదు. ఈ నేపథ్యంలో అప్పటి వరకూ అధిక ధరలతో సొమ్ము చేసుకోవాలన్నది వ్యాపారుల వ్యూహంగా కనిపిస్తోంది.