: ఇది తాళాలను వెదికిపెడుతుందిట
మనలో ఎక్కువమందికి తాళం చెవులు ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అందుకే ఇలాంటి వారికోసమే ప్రత్యేకంగా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం మనం ఎక్కడ పెట్టామో మరిచిపోయిన తాళం చేతులను వెదికిపెడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జర్మనీలోని ఉల్మ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం పేరు 'మైండ్ మై స్టఫ్'. ఈ గాడ్జెట్ మనం ఎక్కడ పెట్టామో గుర్తుకురాని మన తాళం చేతుల ఆచూకీని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ సాయంతో పసిగడుతుందట. ఒక్క తాళం చేతులేకాదు, మనకు సంబంధించిన ఇతర వస్తువులను కూడా గుర్తించి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇది మనకు తెలియజేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మనం ఎప్పుడైనా ఇంట్లో తాళం చెవి వంటివి మరిచిపోతే ఈ గాడ్జెట్‌కు సంబంధించిన సెన్సర్లు వాటిని పసిగట్టి ఫలానా వస్తువు అక్కడ వుంది అంటూ మన స్మార్ట్‌ఫోన్‌కు, కంప్యూటర్‌కు సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ కొత్తరకం గాడ్జెట్‌ను వచ్చేవారం ఆవిష్కరించనున్నారని 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది.