: నా రాష్ట్ర దుస్థితి చూస్తుంటే గుండె మండిపోతోంది : వెంకయ్యనాయుడు


రాష్ట్ర పరిస్థితిపై బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఆవేదనా భరిత ప్రసంగం సాగించారు. రాష్ట్రం లో నెలకొన్ని పరిస్థితులకు ఎవర్ని నిందించాలని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయ నాయకులపై పలు ప్రశ్నలు సూటిగా స్పందించారు. ప్రజల చేత ఎన్నుకోబడి మనం ఎవరిని బలి చేస్తున్నాం? అన్నది ప్రశ్నించుకోవాలని అడిగారు. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండి ప్రజలకు సమాధానం చెప్పలేక మనం ఎవరిని ప్రశ్నిస్తున్నామన్నది అవలోకించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని చూస్తే గుండె మండిపోతుందన్నారు.

'సుభిక్షంగా ఉండే నా రాష్ట్రం అగ్ని గుండంలా మారిపోయింది. దానికి పట్టిన దుస్థితి చూసి రగిలిపోతున్నా'నని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర లీడర్ల వ్యాఖ్యలతో ప్రజలు ప్రత్యర్థులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి పట్టుగొమ్మగా అలరారిన నా రాష్ట్రానికి గత పదేళ్లుగా పెట్టుబడులు రావడం మానేశాయని మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజల్లో ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీగా నిర్ణయం తీసుకోవాల్సినదిపోయి మిగిలిన పార్టీలను ప్రశ్నిస్తున్నారు. సిగ్గుచేటని ఆక్షేపించారు.

'కాంగ్రెస్ పార్టీ స్వంత వ్యవహారంలా రాష్ట్ర విభజన ఇంట్లో జరపడానికి మీకెవరు అధికారమిచ్చార'ని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో ప్రజలు రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పేదెవరని ప్రశ్నించారు. విభజిస్తామంటే అభ్యంతరం లేదు కానీ ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజల ప్రతిష్ఠను కాపాడాల్సిందేనని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను ఏ ప్రాతిపదికన విభజిస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని వెంకయ్య డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో ప్రజలంతా పరిణతి చెందారు కానీ, రాజకీయనాయకులే విభేదాలతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాజధానిని ప్రజలకు ఎలా విభజిస్తారు, సెంట్రల్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, కారిడార్లు, నిర్మాణాలు ఎలా నిర్మిస్తారు? పెట్టుబడులను ఎలా రప్పిస్తారు? ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో నిధులను ఎలా పంచుతారని సూటిగా ప్రశ్నించారు. ఇవేవీ సమాధానం చెప్పకుండా ఎలా విభజన ప్రకటన చేశారని అడిగారు.

వీటన్నింటితో పాటు నదీ జలాలు ఎలా విభజిస్తారని అడిగారు. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ప్రాణాలు తీసుకునేంత తీవ్ర స్థాయకి చేరుకున్నాయని ఆయన తెలిపారు. విద్యుత్ విభజన ఎలా జరుపుతారని సూటిగా ప్రశ్నించారు. సీమాంధ్రలో ఏ పరిశ్రమ ఏర్పాటు చేయకుండా రాజధానిని వదిలేయండని చెబితే, ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. 'మా రాష్ట్రంలో ఆంధ్రా ఎన్జీవోస్, తెలంగాణ ఎన్జీవోస్ గా ఉద్యోగులు విడిపోయార'ని గుర్తు చేశారు. 'మీరు అన్ని పార్టీల దగ్గరకు వెళ్లి అడగండి. అప్పుడు విభజన ప్రకటించండి. అంతే కానీ, ఏకపక్షంగా ఎలా విభజిస్తారని అన్నారు.

ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు లేచి, 'మీ వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింద'ని కామెంట్ చేయగానే, 'మేము మా మాటమీద నిలబడ్డాం' అని వెంకయ్య నాయుడు ప్రకటించారు. 'నిజాయతీగా ఉండండి' అని అధికార పార్టీకి ఆయన సూచించారు. కేంద్రంలో 9 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు కేబినెట్లో ఉన్నారు. వాళ్లని కూడా అధికారపార్టీ చీకట్లోనే ఉంచిందని అన్నారు. 2004 నుంచి 2013 వరకు చర్చలు జరుపకుండా, నిర్ణయం తీసుకోకుండా ఏం చేశారని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News