: కిష్త్వాడ్ మత ఘర్షణల వెనక ఏం జరిగింది?
జమ్మూ పరిధిలోని ఒక ప్రముఖ పట్టణం, జిల్లా కేంద్రం కిష్త్వాడ్. శుక్రవారం నుంచి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత ఘర్షణలు అక్కడ పెద్ద ఎత్తున జరిగాయి. ప్రస్తుతం కర్ఫ్యూ నీడలో ఉన్న ఆ పట్టణంలో అసలేం జరిగింది? అన్నది తెలిస్తేనే గానీ సంఘటనను పూర్తిగా అర్థం చేసుకోలేము.
స్థానికుల కథనం ప్రకారం.. గత శుక్రవారం ముస్లిం యువకులు మత ప్రార్థనలు ముగించుకుని ప్రదర్శనగా కులీద్ మొహల్లా ప్రాంతానికి వచ్చారు. హిందువులైన కాశ్మీరీ పండిట్లు (మైనారిటీలు) ఇక్కడే నివసిస్తున్నారు. అయితే, ముస్లిం యువకుల్లో కొందరు పాకిస్థానీ పతాకాలను ప్రదర్శిస్తూ పండిట్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా పండిట్లకు చెందిన 95 శాతం షాపులకు నిప్పంటించారు.
మరో కథనం ప్రకారం.. పండగరోజు ప్రార్థనలు అయిన అనంతరం కులీద్ మొహల్లా ప్రాంతానికి చేరుకున్న ముస్లింలు ఒక పండిట్ పై దాడి చేశారు. దీంతో స్థానికులు కూడా రంగంలోకి దిగడంతో గొడవ మరింత పెద్దదైంది. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం కర్ఫ్యూ విధించే లోపే పండిట్లకు చెందిన 100 షాపులు అగ్నికి ఆహుతైపోయాయి. ఘటన రోజున ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరుసటి రోజు ఆసుపత్రిలో మరో వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 60 మందికి గాయాలయ్యాయి.
కానీ, ఈ ఘటనకు గల కారణాలు తెలియవని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదం. అల్లర్లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని స్థానిక పండిట్లు అదే రోజు డిమాండ్ చేశారు. ఇన్ని రోజుల తర్వాత దీనిపై న్యాయవిచారణకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదేశించారు.