: ఈ కుక్కలు క్యాన్సర్‌ను పసిగడతాయట!
వాసనను పసిగట్టడంలో కుక్కల ఘ్రాణశక్తి అమోఘం. అందువల్లే వాటిని నేరపరిశోధన విభాగంలో చక్కగా ఉపయోగిస్తుంటారు. అయితే కుక్కలు తమకున్న ఈ అమోఘమైన శక్తితో ఎంచక్కా మనకున్న క్యాన్సర్ వ్యాధిని గురించి పసిగడితే... ఇదే జరుగుతోంది. కుక్కలు చక్కగా క్యాన్సరు వ్యాధిని వాసన చూసి పసిగట్టేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈవిధంగా సదరు కుక్కల్ని తీర్చిదిద్దారు.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వాసన చూడడం ద్వారా కుక్కలు ఒవేరియన్ క్యాన్సర్‌ను పసిగట్టే విధంగా సదరు కుక్కలకు శిక్షణనిచ్చారు. దీంతో ఆ కుక్కలు వాసన చూడడం ద్వారా మహిళల్లో అండాశయ క్యాన్సరును గుర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. శిక్షణ పొందిన ఓహ్లిన్ ఫ్రాంక్ అనే చాకోలేట్ లాబ్రడార్, మెక్‌బైనే చాంబెర్లేన్ అనే స్ప్రింగర్ స్పానియెల్ కుక్కలు ఈ పరిశోధక ప్రాజెక్టులో భాగంగా శిక్షణ పొందాయి. ఈ కుక్కలు అండాశయ క్యాన్సర్‌కు సంబంధించి రసాయన ఫుట్‌ప్రింట్‌ను కనుగొనడంలో శాస్త్రవేత్తలకు చక్కగా తోడ్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ కణాలు విడుదల చేసే ఒక బయోమార్కర్ వాసనను ఈ కుక్కలు పసిగట్టే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.