: కిష్టావర్ లో శాంతి కోసం అన్ని చర్యలు తీసుకుంటాం: ఒమర్
కిష్టావర్ లో శాంతి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. రాజకీయ మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలలో అరున్ జైట్లీ సహా రాజకీయ నేతలు ఎవరినీ అనుమతించమని చెప్పారు. కిష్టావర్ లో ఈద్ పండగ నాడు ఇరు మత వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో ఇద్దరు మరణించగా, 60 మంది వరకూ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ అక్కడ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజా పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు.
కిష్టావర్ జిల్లాలో తాజాగా అల్లర్లు జరిగాయని, ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. అల్లర్ల బాధ్యులను గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒమర్ చెప్పారు. కిష్టావర్, సమీప ప్రాంతాలలో శాంతిని పునరుద్ధరించడమే తమ ధ్యేయమన్నారు. వదంతులను నమ్మవద్దని, శాంతి స్థాపన కోసం ప్రభుత్వ యంత్రాగానికి సహకరించాలని ప్రజలను కోరారు.
మరోవైపు అల్లర్లు అంతకంతకూ విస్తరిస్తుండడంతో ఈ రోజు ఉధంపూర్, సాంబ, కతువా జిల్లాలలో కర్ఫ్యూ విధించారు. ఆర్మీ రంగంలోకి దిగింది. సైనికులు సంబంధిత ప్రాంతాలలో మార్చ్ నిర్వహించారు.