: అక్కడ పిల్లల ఖర్చు ఎక్కువే!
పిల్లలకోసం ఎక్కువగా ఖర్చు పెట్టే తల్లిదండ్రుల్లో బ్రిటన్ వాసులు ముందుంటారు. ఎందుకంటే, బ్రిటన్‌లోని తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఏటా పెట్టే సరాసరి ఖర్చు ఐదు లక్షల యాభైమూడువేల నాలుగు వందల తొంభైరెండు రూపాయలు. ఏంటి, ఆశ్చర్యంతో నోరు తెరిచేశారా... అయినా ఇది మాత్రం నిజం. ఎందుకంటే, ఇది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట కాబట్టి... బ్రిటన్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఖర్చుపెడుతున్న మొత్తం ఇంత అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా పిల్లలు పెరిగేకొద్దీ వారికోసం వెచ్చించే డబ్బు కూడా పెరుగుతూ వస్తుంది. అయితే పదమూడేళ్ల వయసు వచ్చేసరికి ఈ ఖర్చు మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా టీనేజర్లకైతే మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులోని వారు మరింతగా డబ్బు ఖర్చుపెడతారట. ఇంగ్లండులో అయితే ఈ ఖర్చు మరింతగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వారానికి పదకొండువేల రూపాయలను తమ పిల్లలకోసం ఖర్చు చేస్తున్నారట. అయితే ఇంత ఖర్చు ఎందుకంటారా... టీనేజర్లలో ఎక్కువగా చేసే ఖర్చు ఆహారానికి సంబంధించింది మొదటిదట. అందరికంటే ఎక్కువగా టీనేజర్లు ఆహారాన్ని తీసుకుంటారని ఎక్కువమంది తల్లిదండ్రులు తెలిపారు.
తర్వాత స్థానం రైలు, బస్సు టికెట్లు, పెట్రోలు ఖర్చులు ఆక్రమించుకుంటాయట. ఇవేకాకుండా ఒక్కొక్కరికీ నెలకు సగటున రెండు వేల రూపాయల వరకూ పాకెట్ మనీగా కూడా అందజేయాలట. టీనేజర్లలో గాడ్జెట్ల వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. స్నేహితులతో షికార్లు, విహారయాత్రలు, కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ గడపడం వంటివాటివల్ల ఖర్చులు పెరుగుతున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... ఖర్చు తగ్గించుకోమని చెబుతున్న ప్రతి పదిమంది తల్లిదండ్రుల్లో ఆరుగురికి తమ పిల్లలతో వివాదాలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.