: ఈ డ్రస్ కాలుష్యాన్ని గుర్తిస్తుంది!
కాలుష్యం కంటికి కనిపిస్తుందా...? నీటి కాలుష్యం కనిపిస్తుంది, పరిసరాల కాలుష్యం కనిపిస్తుంది... అయితే గాలి కాలుష్యం మాత్రం కంటికి కనిపించదు... దీన్ని కొన్ని ప్రత్యేక పరికరాలు గుర్తించగలుగుతాయి. అయితే మనం వేసుకున్న డ్రస్ మన చుట్టుపక్కల ఉన్న కాలుష్యాన్ని గుర్తిస్తే...! వినేందుకు చాలా విడ్డూరంగా ఉందికదూ... అయితే నిజంగానే అలాంటి ఒక కొత్తరకం డ్రస్‌ను నిపుణులు రూపొందించారు. ఈ డ్రస్ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రాగానే మనల్ని హెచ్చరిస్తుంది. దీంతో మనం త్వరగా ఆ ప్రాంతంనుండి దూరంగా వెళ్లి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన చుట్టుపక్కల ఉన్న గాలిలోని కాలుష్యాన్ని మనం కంటితో చూడలేం. దీంతో మనం పీల్చే గాలివల్ల అనారోగ్యానికి గురవుతుంటాం. మన చుట్టుపక్కల ఉన్న కాలుష్యాన్ని గురించి మనల్ని హెచ్చరించే విధంగా ఒక కొత్తరకం డ్రస్‌ను తయారు చేశారు. ఈ డ్రస్‌లో ఎల్‌ఈడీ లైట్లతో పాటు చుట్టుపక్కల ఉండే హానికర వాయువులను గుర్తించే ప్రత్యేక సెన్సర్లను కలిగివుండేలా దీన్ని రూపొందించారు. అమ్మాయిలకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డ్రస్‌లోని లైట్లు చూసేందుకు ఎబ్బెట్టుగా ఉండేలా కాకుండా చక్కగా డ్రస్ డిజైన్‌లో కలిసిపోయేలాగా దీన్ని రూపొందించారు. ఈ డ్రస్ వేసుకున్నవారు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రాగానే డ్రస్‌లోని లైట్లు వెలుగుతాయి. కాలుష్యం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతానికి రాగానే డ్రస్‌లోని లైట్లు మరింత వేగంగా వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి. ఈ లైట్లను బట్టి మనం ఆ ప్రాంతాన్ని త్వరగా ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవచ్చు. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.