: బీజేపీతో పొత్తు పెట్టుకునే యోచనలో టీడీపీ?
ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం, జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోనుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీలో చర్చిస్తున్నామని, ఏ విషయం ఖరారు కాలేదని చెప్పారు. ఇందుకు కొందరు ఒత్తిడి చేస్తున్నా పొత్తు పెట్టుకుంటే లాభ నష్టాలెంతవరకని చర్చించుకుంటున్నామన్నారు. పొత్తు అంశంలో ఒక విధంగా లాభం, మరో విధంగా నష్టం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, త్వరలోనే దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గుజరాత్ ను నరేంద్ర మోడీ, రాష్ట్రాన్ని చంద్రబాబు ఇద్దరూ అభివృద్ధి చేసినవారే కాబట్టి, రాష్ట్ర విభజన నేపథ్యంలో పొత్తు పెట్టుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారన్నారు. ఇంతవరకూ దీనిపై పార్టీలోనే అంతర్గతంగా చర్చలు జరుగుతుండగా ఈ రోజు ఈ విషయాన్ని ఎర్రబెల్లి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా తెలియజేయడం గమనార్హం.