: దావూద్ ఇబ్రహీంపై పాక్ మాటలను నమ్మలేం: ప్రతిపక్షాలు


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారి షహర్యార్ ఖాన్ చెబుతున్న మాటలను నమ్మలేమని విపక్షాలు అంటున్నాయి. మూడు రోజుల కిందట జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం జరిపిన కాల్పులను పక్కదారి పట్టించేందుకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

దావూద్ పై పాక్ చెప్పిన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ జనరల్ సెక్రెటరీ రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ కు తమ దేశంలో దాదాపు పది సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చి ఇలాగే డ్రామాలు ఆడిందని, ఆ తరుణంలోనే అమెరికా ఆకస్మికంగా మట్టుబెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. అలాంటప్పుడు ఈ మాటలకు అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదుకదా? అన్నారు.

ఇదే విషయంపై రక్షణ శాఖ రిటైర్డ్ కెప్టెన్ భరత్ వర్మ మాట్లాడుతూ.. 'పాక్ లో దావూద్ ఉన్నాడనటానికి చాలా అవకాశాలున్నాయి. భారత్ ను తప్పుదోవ పట్టించేందుకే పాక్ ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని భారత నిఘా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి' అని విజ్ఞప్తి చేశారు. అటు ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ దావూద్ పై పాక్ మాటలను నిజంగా నమ్మలేమని చెప్పింది. తప్పకుండా దావూద్ ను పట్టుకుంటామని ఆ పార్టీ నేత మీమ్ అఫ్జల్ తెలిపారు.

  • Loading...

More Telugu News