: రాజకీయ ప్రయోజనాల కోసమే సోనియా జోక్యం: అజంఖాన్
ఉత్తరప్రదేశ్ లో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే సోనియా గాంధీ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్ పాల్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజంఖాన్ ఆరోపించారు. లక్నోలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలతో నడుస్తుండగా, విదేశీయురాలు వారిని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి విషయంలో సోనియా, ప్రధానికి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అతి సున్నితమైన వ్యక్తని, దుర్గాశక్తి సస్పెన్షన్ విషయంలో ఆయన జోక్యం చేసుకోకుండా హుందాగా వ్యవహరించారని అన్నారు. కాగా సోనియాపై వ్యాఖ్యలను ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషీ ఖండించారు. సమాజ్ వాదీ పార్టీ నేతలతో చెప్పించుకునే స్థితిలో సోనియా లేరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.