: మోడీ సభకు హైటెక్ ఏర్పాట్లు
హైదరాబాదులో రేపు జరగనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 'నవభారత యువభేరీ' సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం లాల్ బహుదూర్ స్టేడియంలో కమలనాథులు పెద్ద వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడనుంచి మోడీ ప్రసంగాన్ని సులభంగా చూసేందుకు, సభకు హాజరయ్యే వేలమంది కోసం మైదానం లోపల, బయట 12 ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు.
ఎల్ బీ స్టేడియానికి స్వామి వివేకానంద ప్రాంగణంగా పేరు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మహిళల కోసం రెండు ప్రత్యేక ద్వారాలను కేటాయించారు. ఇక స్టేడియం ప్రధాన ముఖ ద్వారాలకు రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయ ద్వారాలుగా పేర్లు పెట్టారు. సభకు హాజరుకావాలనుకునే వారు పేర్లు నమోదు చేసుకునేందుకు నేడు ప్రాంగణం లోపల 20 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు చేరుకోనున్న మోడీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.