: ఉగ్రవాద నిరోధానికి 'ఎన్ సీటీసీ' అవసరమే!


జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ (ఎన్ సీటీసీ) .... ఇది మంత్రి చిదంబరం మానస పుత్రిక. దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు రాష్ట్రాల సమన్వయంతో కేంద్రం ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని హోం మంత్రిగా వున్నప్పుడు ఆయన ఎంతో పట్టుబట్టారు.  ఆమోదం కోసం 2011 పార్లమెంటు సమావేశాల్లో ఎంతో ప్రయత్నించారు.  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో కలిసి సమావేశాన్ని కూడా  నిర్వహించారు. కానీ, ఎక్కువ మంది అందుకు విముఖత వ్యక్తం చేశారు.

రాష్ట్ర అధికారాలు కేంద్రం 
చేతుల్లోకి వెళ్తాయనీ, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ రాష్ట్రాల్లో తనిఖీలు ఉంటాయంటూ పలువురు తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చారు. తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లతో బాటు, బీజేపీ సైతం అడ్డుపడింది. ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదం తెలిపే ప్రస్తక్తే లేదని వారు తేల్చి చెప్పడంతో ఎన్ సీటీసీ మరుగున పడింది. చిదంబరం ఆర్ధిక మంత్రి అయ్యారు. ఇప్పుడు దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల నేపథ్యంలో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విపక్షాలు శుక్రవారం రాజ్యసభలో తీవ్రంగా ఆరోపించడంతో, అందుకు దీటుగా మాట్లాడేందుకు ప్రయత్నించిన కేంద్ర హోంమంత్రి షిండే ఎన్ సీటీసీని ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఎన్ సీటీసీని ఏర్పాటు చేయాలని చేసిన ప్రయత్నానికి కొన్ని రాష్ట్రాలు అడ్డుడ్డాయని గుర్తు చేశారు.

ఇప్పుడు దాడులు జరిగిన నేపథ్యంలో దీనిపై పునరాలోచించిన పలువురు, ఎన్ సీటీసీ అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశాన్ని ఉగ్రవాదం పట్టిపీడిస్తోన్న ప్రస్తుత  తరుణంలో ఇలాంటి సంస్థ కావాలని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదం భారత్ లో వేళ్లూనుకుని, వృక్షంలా పెరిగిపోయిన తరుణంలో ఈ చర్యలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తాయో చూడాల్సిందే!

  • Loading...

More Telugu News