: తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదు: కావూరి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. నాలుగేళ్లు ఆగినవారు మరికొంత కాలం ఆగలేరా? అంటూ ఆయన తెలంగాణ వారిని ప్రశ్నించారు. కొంత మంది నేతల కోసం విభజన నిర్ణయం తీసుకుంటే మంచిది కాదన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉందని, ఎప్పుడూ ఇలాగే ఉంటే బావుంటుందన్నారు. దేశవ్యాప్తంగా గౌరవం ఉంటుందని చెప్పారు. తమవైపు ప్రయత్నాలలో ఎలాంటి లోపాలు లేవన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చ జరగలేదని చెప్పారు. చిన్న రాష్ట్రాల వల్ల మేలు జరగదని, 42 మంది ఎంపీలున్న రాష్ట్రం ఎప్పటిలానే కలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. తానిప్పటికీ సమైక్యవాదినేనని, అభిప్రాయాన్ని మార్చుకోలేదని స్పష్టం చేస్తూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కావూరి సాంబశివరావు చెప్పారు.