: టీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి తోట
రాష్ట్ర పరిస్థితులపై టీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నర్సింహం విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఆయన మాట్లాడుతూ సాగునీరు, త్రాగు నీరు, విద్యుత్తు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవాలు వెల్లడిస్తే, దానికి టీఆర్ఎస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలని, అది లేకే తప్పుడు లెక్కలతో టీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, పూర్వం భద్రాచలం పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్ లో ఉండేదని, అందువలన దానిని మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని మంత్రి తోట డిమాండ్ చేశారు.