: వీళ్ళు మంచి దొంగలు!


దొంగలు దోచుకుంటే పర్లేదు, ఈ మధ్య ప్రాణాలు తీసేందుకూ వెనకాడడంలేదు. కానీ, దొంగలందు మంచి దొంగలు వేరయా అన్నట్టు.. అమెరికాలో కొందరు చోరులు తమకూ హృదయం ఉందని చాటుకున్నారు. తాము దోచుకెళ్ళింది ఆపన్నుల కోసం పాటుపడే ఓ సంస్థకు చెందిన సొత్తని గుర్తించి, దాన్ని వెంటనే తిరిగిచ్చేశారీ మంచి దొంగలు! వివరాల్లోకెళితే.. ఓ రోజు అమెరికాలోని శాన్ బెర్నార్డియో కౌంటీలోని లైంగిక దాడుల బాధితుల సేవా కేంద్రంలో దొంగలు పడ్డారు. అక్కడున్న విలువైన కంప్యూటర్లను, ల్యాప్ టాప్ లను ఎత్తుకెళ్ళారు. దీంతో, సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత, తామెత్తుకొచ్చింది.. లైంగిక దాడులకు గురైన బాధితులకు నిస్వార్థంగా సేవలందించే సంస్థకు చెందిన వస్తువులని వారు గ్రహించారు.

తాము తప్పు చేశామని భావించిన ఆ చోర శిఖామణులు.. వెంటనే ఆ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను గుట్టుచప్పుడు కాకుండా ఆ సంస్థ కార్యాలయంలో ఉంచేసి గప్ చుప్ గా తిరిగొచ్చేశారు. తర్వాత ఓ రోజు ఆఫీసుకు వచ్చిన సిబ్బంది కార్యాలయం లోపల ఓ బాక్స్ లో తమ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను చూసి ఆశ్చర్యపోయారు. పోతూపోతూ ఆ దొంగలు అక్కడో కాగితంపై చిన్న సందేశాన్ని కూడా ఉంచారు. ' మేం ఎవరి వస్తువులు తీసుకెళుతున్నామో మాకు తెలియలేదు. తెలిసిన తర్వాత బాధపడ్డాం. అందుకే తిరిగిచ్చేస్తున్నాం. ఆపన్నులకు ఇంకా మంచి సేవలు అందించాలి. గాడ్ బ్లెస్ యూ' అని తమ సందేశంలో పేర్కొన్నారు. నిజంగా మంచి దొంగలే కదూ!

  • Loading...

More Telugu News