: కాంగ్రెస్ పార్టీకి సిగ్గులేదు.. సీఎం మాటల వెనుక అధిష్ఠానం: ఎర్రబెల్లి
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు, శరం లేవని దుయ్యబట్టారు. హైదరాబాదులో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎర్రబెల్లి, సీఎం కిరణ్ తాజా వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. విభజన అనంతరం ఏ ప్రాంతానికి ఏమి చేయాలనేదానిపై స్పష్టత లేకుండానే ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన సిగ్గులేనితనాన్ని మరోసారి చాటుకుందని వ్యాఖ్యానించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలోనూ.. ఓవైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు అణగదొక్కేందుకు యత్నించిందని ఆరోపించారు.
నిన్న మీడియా ముందుకొచ్చిన సీఎం ఆ వ్యాఖ్యల ద్వారా తన అసమర్థతను, అనుభవలేమిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. అప్పట్లో తెలంగాణ ఇస్తామని టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది వైఎస్సేనని చెప్పారు. వైఎస్ అధికార దాహంతో చిన్నారెడ్డి నాయకత్వాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు. తదనంతర కాలంలో సోనియా, వైఎస్ కుమ్మక్కై టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు.