: హైదరాబాదులో ఉన్న వారందరూ తెలంగాణ వారే: రాజనర్సింహ


హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తెలంగాణ వారేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇక్కడున్న వారు సెటిలర్లు కాదని, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆత్మగౌరవం, స్వయంపాలనకు సంబంధించినదని అన్నారు. గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్నే తాము డిమాండ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం విశాలాంధ్రను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు.

నదీజలాలు, విద్యుత్ తదితర అంశాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజనర్సింహ తప్పుబట్టారు. తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల వినియోగంలో ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ఇన్నేళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రులు 15 ఏళ్ళపాటే పనిచేశారని, 44 ఏళ్ల పాటు పాలించిన ఇతర ప్రాంత ముఖ్యమంత్రులు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారని రాజనర్సింహ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంతో మంది తెలంగాణ ప్రాంతానికి వచ్చి వ్యవసాయం ఇతరత్రా పనుల్లో స్థిరపడిపోయారని, అది తెలంగాణ ప్రజల గొప్పతనంగా చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు వస్తాయంటున్నవారు.. వాటికి సృష్టికర్తలెవరో చెప్పాలన్నారు.

ఇక సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. అధిష్ఠానాన్ని ధిక్కరించిన వారెవరూ చరిత్రలో మిగల్లేదన్నారు. విద్యుత్ సమస్యను ప్రముఖంగా ప్రస్తావిస్తున్న కిరణ్.. కృష్ణా, గోదావరిపై రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే 6,650 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని సూచించారు.

  • Loading...

More Telugu News