: తెలంగాణలో మళ్ళీ ఉద్యమం?
సీఎం కిరణ్ మీడియా సమావేశం నేపథ్యంలో మరోసారి తెలంగాణ ఉద్యమం పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలూ వెలువడుతున్నాయి. పంపకాలపై స్పష్టత ఇచ్చే, విభజన ప్రక్రియపై ముందుకు కదలాలని సీఎం తెగేసి చెప్పడం తెలంగాణ వాదుల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తించింది. దీనిపై, శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పగా.. సీఎం వాదన చూస్తే మళ్ళీ తెలంగాణలో ఉద్యమం మొదలవుతుందనే భయం కలుగుతోందని పార్లమెంటు సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇక పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు.
ఓవైపు కిరణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ జిల్లాల్లో ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మరోవైపు, సీఎం పదవిలో కొనసాగే అర్హత కిరణ్ కు లేదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు, ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీ అనంతరం ఉద్యమంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.