: కిరణ్.. నీ గోడు ఆంటోనీ కమిటీతో చెప్పుకో: వీహెచ్


సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ, ఆయనకేవైనా సమస్యలుంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇంకా ఇబ్బందులేవైనా ఎదురైతే అధిష్ఠానానికి విన్నవించుకోవాలని సూచించారు. సీఎం కిరణ్ నిన్న రాత్రి మీడియాతో మాట్లాడుతూ, నీటి పంపకాల విషయంలో స్పష్టత రావాల్సి ఉందనడం బాధాకరమని వీహెచ్ వ్యాఖ్యానించారు. నీళ్ళు, విద్యుత్ పై చర్చించాకే కాంగ్రెస్ అధిష్ఠానం విభజన నిర్ణయం తీసుకుందని వివరించారు. జలవనరుల సమస్య కొత్తేమీ కాదని అన్నారు. అన్నీ తెలిసీ కిరణ్ ఇలా మాట్లాడడం ప్రజలను రెచ్చగొట్టేందుకే అని భావించాల్సి వస్తోందని చెప్పారు.

కిరణ్ మాటలు వింటుంటే, తెలంగాణకు సీఎం అడ్డుపడుతున్నాడని, ఇక్కడ కూడా ఉద్యమం మొదలవుతుందనే భయం కలుగుతోందని అన్నారు. అయినా, అన్ని పార్టీల నిర్ణయం విన్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణపై తాను వెనక్కిమళ్ళననని స్పష్టం చేశారని వీహెచ్ గుర్తు చేశారు. సీఎం ధోరణి చూస్తుంటే విపక్ష నేతలను తలపిస్తోందని విమర్శించారు. ఆయన తీరు హైకమాండ్ ను ధిక్కరిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News