: బరువు గురించి ఆందోళన అనవసరం
బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి తల్లీ బరువు పెరిగే ఉంటుంది. అయితే పెరిగిన బరువు గురించి సహజంగా మహిళల్లో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. గర్భవతులు క్రమేపీ బరువు పెరుగుతుంటారు. కాన్పు సమయానికి ఒక మోస్తరు బరువు పెరగడం సహజమే. అయితే ఇలా పెరిగిన బరువు గురించి స్త్రీలు అధికంగా ఆందోళనకు గురవుతుంటారని ఒక అధ్యయనంలో తేలింది.
తల్లులు కాబోయే మహిళలు తమ బరువు గురించి బాగా ఆందోళనకు గురవుతారట. అంతేకాదు, తమకు పుట్టబోయే బిడ్డగురించి కూడా వీరు ఆందోళనకు గురవుతారట. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకూ తల్లులు లావుగా కనిపించడం, బరువు పెరగడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే వీలైనంత తొందరగా తాము మునుపటి రూపానికి రావాలని నేటి మహిళలు ఆరాటపడుతున్నట్టు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణం భాగస్వామి ఒత్తిడి చేయడమేనని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఇరవై శాతం మంది మహిళలు చెప్పారట. మరో ముఫ్ఫై శాతం మంది చుట్టుపక్కల వారితో బాగా లావైపోయావే అనిపించుకోకుండా ఉండేందుకు తాము కాన్పు అయిన తర్వాత వీలైనంత త్వరగా లావు తగ్గాలని కోరుకుంటున్నారట. కాన్పు తర్వాత పెరిగిన బరువు, ఆకారంలో మార్పు కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామనీ, ఏ పనిమీదా దృష్టి పెట్టలేకపోతున్నామనీ మిగిలినవారు అంటున్నారట.
ఈ విషయం గురించి లండన్‌కు చెందిన అధ్యయనకర్తలు మాట్లాడుతూ పిల్లల్ని కనే సమయంలో గర్భంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కండరాలు బాగా వ్యాకోచించి పెద్దగా కనిపిస్తాయి. బిడ్డ పూర్తిగా ఎదగడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్ల పాటు పొట్ట ఎత్తుగానే కనిపిస్తుంది. అది మామూలు స్థితికి రావడానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలల సమయం కూడా పడుతుంది. పూర్తిగా మనం ముందున్న రూపానికి రావాలంటే సుమారుగా తొమ్మిది నెలలు ఆగాల్సిందేనని, ఇది సహజంగా జరిగే పరిణామమని, ఈ విషయాన్ని మరిచిపోయి ఆడవాళ్లు అనవసరంగా ఆందోళన చెందటం అంత మంచిది కాదని చెబుతున్నారు.