: నీరు కన్నా బీరే మేలట!
బాగా శ్రమించినప్పుడో, ఎండనపడి తిరిగినప్పుడో.. మనం వెంటనే చేసే పని మంచినీళ్ళు తాగడమే. కానీ, స్పెయిన్ లోని గ్రెనడా యూనివర్శిటీ పరిశోధకులు ఇలాంటి పరిస్థితుల్లో నీరు కన్న బీరే మేలంటున్నారు. శరీరం అలసేలా కసరత్తులు చేసిన వెంటనే నీటికి బదులుగా బీరు తాగితే శరీరం కోల్పోయిన నీటి శాతం భర్తీ అవుతుందని పరిశోధనలకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ మాన్యుయేల్ గార్జాన్ అంటున్నారు. బీరులో ఉండే కార్బొనేషన్ దాహం తీర్చడమే కాకుండా, అందులోని కార్బొహైడ్రేట్లు కోల్పోయిన కెలోరీలను భర్తీ చేస్తాయట. ఈ వివరాలు రాబట్టేందుకు కొందరు విద్యార్థులపై ప్రయోగాలు చేశారు. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుకునేదాకా వారందరితో కసరత్తులు చేయించారు. అనంతరం తాగడానికి, వారిలో కొందరికి నీరు మరికొందరికి బీరు ఇచ్చారు. ఇక వారిలో హైడ్రేషన్ శాతాన్ని పరిశీలిస్తే.. నీరు తాగిన వారికన్న బీరు తాగిన వారిలోనే మెరుగైన రీతిలో నమోదైందట. సో, బీరు ప్రియులకు ఇది మరింత తీపికబురే!