: భారత్ లో పాక్ నటులను నిషేధించండి: శివసేన
పూంచ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత జవాన్లపై కాల్పుల ఘటనపై పలు పార్టీల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన శివసేన భారతీయ భాషల్లో నటిస్తున్న పాకిస్తాన్ నటీనటులను తక్షణమే నిషేధించాలని డిమాండు చేసింది. పాక్ నటీనటులను తమ చిత్రాల్లో నటింపజేస్తున్న దర్శకులు, నిర్మాతలను ఈమేరకు చిత్రపథ్ సేన హెచ్చరించింది. చిత్రపథ్ సేన.. శివసేనకు అనుబంధ విభాగం.
ఏ పాక్ కళాకారుడికీ అవకాశాలివ్వవద్దంటూ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ కు సూచించింది. ఈ ఘటనపై ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపనక్కర్లేదని, ఇందుకు తాము అంగీకరించబోమని చిత్రపథ్ సేన అధికార పత్రినిధి సంజయ్ రౌత్ చెప్పారు. యాభై సంవత్సరాల నుంచి ఇప్పటివరకూ పాక్ తో శాంతి చర్చలు జరుపుతున్నా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం శోచనీయమన్నారు.