: గంగూలీ, ధోనీ 'మంచి కెప్టెన్లే'.. అయితే, గంగూలీ 'గ్రేట్ కెప్టెన్': స్టీవ్ వా
విదేశీ క్రికెటర్లలో భారతీయుల మది దోచిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా స్టీవ్ వా నే. ఈ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ భారతీయతను అమితంగా ఇష్టపడతాడు. 1998 లో ఈడెన్ గార్డెన్స్ లో టెస్టు ఆడేందుకు వెళ్లిన స్టీవ్ వా, కోల్ కతాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉదయన్ సేవా సంస్థను సందర్శించారు. ఇక అప్పట్నుంచి ఆయన ఉదయన్ కు తన కుటుంబంతో పాటు సేవలందిస్తూ తన గొప్పదనాన్ని ఇనుమడింపజేసుకుంటున్నాడు. క్రికెట్ తో అనుబంధం వీడినా ఉదయన్ తో తన బంధాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. అందుకే ఉదయన్ బాలలు స్టీవ్ దా, స్టీవ్ అంకుల్ అని ప్రేమగా పిలుచుకుంటారు.
తాజాగా కొల్ కతాలోని ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో పాల్గొన్న స్టీవ్ వా ను జర్నలిస్టులు టీమిండియా కెప్టెన్లలో ఎవరు గొప్ప వారు? అని ప్రశ్నించగా అందరూ గొప్పవారే అన్నాడు. ధోనీ, గంగూలీ ఇద్దర్లో ఎవరు గొప్ప? అని రెట్టించగా గంగూలీ, ధోనీ ఇద్దరూ మంచి కెప్టెన్లే కానీ, గంగూలీ గ్రేట్ కెప్టెన్ అన్నాడు. గంగూలీకి వనరులను వాడుకోవడంతో పాటు జట్టును ఎలా సన్నద్ధం చేయాలి, ప్రత్యర్థులను ఆత్మరక్షణలో ఎలా పడెయ్యాలన్న విషయాలు బాగా తెలుసన్నాడు. గంగూలీ పరిస్థితులను తనకు తగ్గట్టు మార్చుకుంటాడని, ధోనీ పరిస్థితులకు తగ్గట్టు మారతాడని స్టీవ్ వా తెలిపారు.