: 'టెలిగ్రామ్ సర్వీసు' నిలిపివేతకు కారణాలివే
గతనెల 15వ తేదీ నుంచి దేశంలో టెలిగ్రామ్ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ మూసివేయడానికి గల కారణాలను ఐటి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవ్ రా వెల్లడించారు. 2012-13లో టెలిగ్రామ్ సేవల నిమిత్తం రూ.142 కోట్లు ఖర్చుచేస్తే రూ.132 కోట్ల నష్టం వచ్చిందని, అందుకే సర్వీసులను ఆపివేసినట్లు ఈరోజు లోక్ సభలో లిఖిత పూర్వక సమాధాన పత్రంలో తెలిపారు. టెలిగ్రామ్ సర్వీసుతో పోల్చుకుంటే కొత్తగా వచ్చిన విధానాల ద్వారా ప్రజలకు త్వరితగతిన సమాచారం అందుతుందన్నారు.
2011-12లో రూ.136 కోట్లు, 2010-11లో రూ.147 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు. అయితే, సేవలు నిలిపివేత వల్ల బీఎస్ఎన్ఎల్ లో ఏ ఒక్కరూ తమ ఉద్యోగాన్ని కోల్పోలేదని చెప్పారు. మొదటిసారి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, కోల్ కతా మధ్య 1850లో ఈ సేవలను ఉపయోగించుకున్నారు. 1854 నుంచి ప్రజలకు వాడుకలోకి రాగా, తొలి దశలో దేశవ్యాప్తంగా 75 టెలిగ్రామ్ కేంద్రాలు ఏర్పడ్డాయి.