: కాంగ్రెస్ నేతలతో సంప్రదింపుల కోసమే కమిటీ: యనమల
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజలతో కలిసి రాకుండా ఉండేందుకు వారితో సంప్రదింపుల కోసమే కాంగ్రెస్ అధిష్ఠానం కమిటీ వేసిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం కాదని తెలిపారు. 1999లో వేర్పాటు వాద భావనకు పునాది వేసింది వైఎస్సే అని దిగ్విజయ్ కూడా ధ్రువీకరించాడని గుర్తు చేశారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో నిప్పు పెట్టింది వైఎస్సేనని, ఆ పాపంలో ముద్దాయిలు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ లేనని ఆరోపించారు. టీడీపీని దెబ్బతీయాలన్న దుర్బుద్ధితో తెలుగు జాతి మనుగడకే తీవ్ర నష్టం కలిగించారని యనమల మండిపడ్డారు.