: అలాంటి ఆహారంతో షుగరు మాయం!
షుగరు వ్యాధిని దూరం చేయడానికి శాస్త్రవేత్తలు రూపొందించిన తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల తనకున్న షుగరు వ్యాధి మటుమాయం అయ్యిందని రిచర్డ్ డౌటీ చెబుతున్నారు. కుటుంబంలో షుగరువ్యాధి గ్రస్తులు ఎవరూ లేకున్నా కూడా షుగరు వ్యాధి సోకడంతో దీనిపై ఇంటర్నెట్లో శోధిస్తుండగా అక్కడ కనిపించిన ఆహారానికి సంబంధించిన సూచనలను పాటించడంతో డౌటీ తనకున్న షుగరు వ్యాధి చక్కగా తగ్గినట్టు చెబుతున్నారు.
బ్రిటన్కు చెందిన రిచర్డ్ డౌటీ ఏడాది కిందట రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు షుగరు వ్యాధి ఉన్నట్టు తేలింది. ఈ విషయం గురించి డౌటీ మాట్లాడుతూ తన కుటుంబంలో షుగరు వ్యాధి ఉన్నవారు ఎవరూ లేరని, తన బరువు కూడా మామూలుగానే ఉందని, ఎన్నడూ తాను పొగతాగింది లేదని, మంచి ఆహారాన్ని తీసుకుంటానని అయినా కూడా తనకు షుగరు ఉన్నట్టు తెలియగానే చాలా ఆశ్చర్యపోయానని చెప్పాడు. షుగరు వ్యాధి గురించి తాను ఇంటర్నెట్లో శోధిస్తుండగా న్యూకాజిల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాయ్ టేలర్ రూపొందించిన తక్కువ కేలరీల ఆహారం కొన్ని వారాల్లోనే షుగరును వెనక్కి మళ్లిస్తుందని చదివానని, వైద్యుడి సలహా మేరకు దాన్ని ఆచరణలో పెట్టానని డౌటీ తెలిపారు.
డౌటీ ఉన్న ఎత్తు, బరువుల మేరకు ఆయన రోజుకు 2,500 కేలరీల ఆహారం తీసుకోవాలి. కానీ ఆయన భోజనానికి బదులుగా షేక్స్, సూప్స్ ద్వారా 600 కేలరీలు, ఆకుకూరలు, కూరగాయల ద్వారా 200 కేలరీలు, మూడు లీటర్ల నీరు తీసుకున్నాడు. ఈవిధంగా 11 రోజుల పాటు తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదు మామూలు స్థాయికి చేరుకుందని, సంవత్సరమైనా కూడా అది అలాగే కొనసాగుతోందని డౌటీ వివరించారు. తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరం తనకు అవసరమైన శక్తికోసం కొవ్వును వినియోగించుకున్నట్టు, ఇందులో భాగంగా ముందు అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు కరుగుతున్నట్టు టేలర్ అధ్యయనంలో తేలింది. అందువల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు కీలకమైన కాలేయం, క్లోమంలో కొవ్వు పోగుపడడం వల్ల టైప్2 మధుమేహం వస్తుందనే భావనతో ఆయన ఇలాంటి తక్కువ కేలరీల ఆహార పద్ధతిని రూపొందించారు.