: చిన్న సినిమాలకు పండగే
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినప్పటినుంచి సీమాంధ్ర అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలు ఏకతాటిపై నిలిచి చేస్తున్న ఈ ఉద్యమం టాలీవుడ్ కు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలు విడుదలకు నోచుకోకపోగా.. రొమాన్స్ వంటి చిన్న సినిమాలు పండుగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సమైక్యాంధ్ర ఎఫెక్ట్ మెగా ఫ్యామిలీ సినిమాలకు బాగా తాకింది. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది, రామ్ చరణ్ ఎవడు సినిమాల విడుదల తేదీ వాయిదా పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేయకపోతే, పవన్, రామ్ చరణ్ సినిమాలను అడ్డుకుంటామని జేఏసీలు హెచ్చరించిన నేపథ్యంలో ఆ సినిమాల నిర్మాతలు వేచి చూడాలని భావిస్తున్నారు.
ఇక ఎప్పుడూ పెద్ద సినిమాల ధాటికి థియేటర్లు దొరక్క విలవిల్లాడే చిన్న సినిమాలు సందట్లో సడేమియాలో కలెక్షన్లు దండుకునేందుకు రెడీ అవుతున్నాయి. మారుతి కొత్త చిత్రం 'రొమాన్స్' ఇప్పటికే ఓ మోస్తరు టాక్ స్వంతం చేసుకోగా.. '1000 అబద్ధాలు', 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్' వంటి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక తమిళంలో స్టార్ ఇమేజి ఉన్న విజయ్ నటించిన తలైవా సినిమా అన్న పేరుతో తెలుగులో ఈ నెల 9న విడుదల కానుంది. పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడంతో ఈ ఆగస్టులో చిన్న, డబ్బింగ్ సినిమాలే బాక్సాఫీసు వద్ద హల్ చల్ చేస్తాయని సినీ విశ్లేషకులంటున్నారు.