: ఖైదీకి కాసులు కురిపించిన హజారే చిత్రం
అవినీతి వ్యతిరేక ఉద్యమ సూరీడు అన్నా హజారే చిత్ర రూపం తీహర్ జైలులోని ఒక ఖైదీకి కనకవర్షం కురిపించింది. జైలులో తనతోపాటే మూడు రోజులున్న అన్నా చిత్రాన్ని ఆయిల్ పెయింటింగ్ తో చిత్రీకరించాడు ఆ ఖైదీ. ఇప్పడు దాన్ని ముచ్చటపడి ఓ విదేశీయుడు 20వేలు చెల్లించి మరీ తీసుకెళ్లాడు. అరగంట పనితో ఆ ఖైదీ జేబు నిండిపోయింది.
హత్య కేసులో లంకేశ్వరన్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అవినీతి నిర్మూలనకు లోక్ పాల్ బిల్లును తీసుకురావాలంటూ అన్నా హజారే 2011లో ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. ఆ సందర్భంలో ఢిల్లీ పోలీసులు అన్నాను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు ఉంచారు. ఆ సమయంలో లంకేశ్వరన్... అన్నా హజారే చిత్రాన్ని గీశాడు. ఇలా ఖైదీలు గీసిన పలు చిత్రాలతో ఎగ్జిబిషన్ నిర్వహించగా.. అన్నా చిత్రాన్ని విదేశీ అభిమాని 20వేలు పెట్టి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
లంకేశ్వరన్ ఒక్కడే కాదు. ఇలా తీహార్ జైలులోని 20 మంది ఖైదీలు పెయింటింగ్ లో శిక్షణ పొంది ఉన్నారు. వీరంతా ఇప్పడు కాసులు కురిపించుకుంటున్నారు. కాకపోతే ప్రముఖ ఉద్యమ కారుడైన అన్నాను నమ్ముకున్నందుకు లంకేశ్వర్ కు కాస్త ఎక్కువే ప్రతిఫలం ముట్టింది.